*ప్రాణం తీసిన వివాహేతర సంబంధం*
*భర్తను హత్య చేయించి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం*
*తమ్ముడు, మరొకరితో కలిసి ఘాతుకం*
*కారు అద్దెకు తెచ్చిన భార్య సన్నిహితుడు*
*యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరులో ఘటన*
మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో తమ్ముడు, తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ఎస్ఐఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి(38)కి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహంకాగా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టి 50మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతిచెందగా, వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, మెరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి హత్యోదంతం
ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య. తరుపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు. చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ లను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. మహేష్ భార్యతో స్వామికి వివాహేతర సంబంధం ఉండటంతో ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్, తనతో సన్నిహితంగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయికుమార్తో కలిసి ప్రణాళిక రూపొందించింది. సాయికుమార్ ఓ కారు అద్దెకు తీసుకువచ్చి స్నేహితుడి కలిసి కారు నడుపుకుంటూ స్వామి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. పథకం ప్రకారం సాయికుమార్ అతని స్నేహితుడితో కారులో వచ్చి స్వామి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి హత్యకు పాల్పడ్డారని, రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వామి బాబాయి అయిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనలో స్వాతి (ఏ1), మహేష్ (ఏ2)లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వాహనం నడిపిన, వాహనంలో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959