కుక్కపిల్లంత ఎద్దు ఎక్కడైనా కనిపించిందా… ఇంతకుముందు చూడకపోయినా ఇప్పుడు చూడొచ్చు. తాజాగా ఓ గోశాలలో అడుగు నుంచి రెండున్నర అడుగులసైజులో బుల్లిబుల్లి ఆవుల్నీ, ఎద్దుల్నీ సృష్టించారు..పొట్టి ఆవుల జాతుల్లోనే మరీ పొట్టివంటూ చెబుతున్న ఈ మినియేచర్ ఆవుల ప్రత్యేకతలేమిటంటే…

సాధారణంగా ఆవులు ఎంత పొట్టివైనా కనీసం అయిదు అడుగుల ఎత్తయినా ఉంటాయి. అదే పొట్టి జాతులుగా చెప్పే పుంగనూరు ఆవులు మాత్రం మూడు అడుగుల ఎత్తు వరకూ కనిపిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉన్న లింగంపర్తి నాడీపతి గోశాలలో మాత్రం అంత కన్నా చిన్నగా ఉండే బుజ్జి ఆవుల్నీ, ఎద్దుల్నీ చూడొచ్చు. చూడ్డానికి అచ్చం బొమ్మల్లాగే అనిపించే ఈ మినియేచర్ ఆవుల్లో ఎన్నో రకాలూ ఉన్నాయి. అడుగు ఎత్తున్నవి నాడీపతి నానో రకమైతే, రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నవి మైక్రో మినియేచర్ పొట్టి జాతి. తెలుపు, నలుపు, ఎరుపు, గోధుమ… ఇలా వివిధ రంగుల్లో ఉండే ఈ చిట్టి ఆవులు చూడ్డానికి ముద్దొచ్చే రూపంతో ఉండటమే కాదు, రోజూ లీటరు నుంచి రెండు లీటర్ల వరకూ పాలు కూడా ఇస్తాయి. మామూలు పొట్టి జాతి ఆవుల కన్నా వీటి జీవిత కాలమూ ఎక్కువేనట! అసలు వీటి సృష్టి ఎలా జరిగిందీ అంటే…
కాకినాడకు చెందిన నాడీపతి వైద్యుడు పెనుమత్స కృష్ణంరాజు- కనుమరుగైపోతున్న పొట్టి జాతి ఆవుల్ని సంరక్షించాలన్న ఆలోచనతో దాదాపు 18 ఏళ్ల క్రితం పరిశోధనలు మొదలుపెట్టారట. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతి ఆవుని సృష్టించాలని కాకినాడలోని లింగంపర్తి దగ్గర అయిదు ఎకరాల్లో గోశాలను ఏర్పాటు చేశారు. ఈ పొట్టి ఆవుల ఉత్పత్తిలో జన్యువులతోపాటు, వాతావరణ పరిస్థితులూ ప్రభావం చూపిస్తాయంటూ కొండ-పల్లపు ప్రాంతాల్లో ప్రయోగాలు చేస్తూ అందుకు అనువుగా ఉన్న లింగంపర్తి ప్రాంతాన్ని ఎంచుకున్నారట. చిత్తూరుకు చెందిన పుంగనూరు, కేరళ వేచూరు రకాలతోపాటు మల్నాడు గిద్ద, బోనీ, మినీ మౌస్ లాంటి రకరకాల పొట్టి జాతులతో బ్రీడింగ్ చేస్తూ ఈ మినియేచర్ ఆవుల రకాన్ని తయారుచేశారు. మూడు అడుగుల నుంచి అడుగు ఎత్తున్న డ్వార్ఫ్ ఆవు జాతి పుట్టడానికి చాలా ఏళ్లే పట్టిందట. మొదట అయిదు అడుగుల ఎత్తు ఉండే మేలు రకం ఆవుల్నీ, పుంగనూరు ఎద్దుల్నీ కలిపి మూడు అడుగుల ఎత్తున్న ఆవుల్ని వృద్ధి చేశారు. తర్వాత వాటిలోనూ జన్యుమార్పిడి చేసుకుంటూ వాటి ఎత్తును తగ్గిస్తూ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ వాటిల్లో మేలైన ఆవుల్నీ, ఎద్దుల్నీ ఎంచుకుంటూ అదే పద్ధతిని కొనసాగిస్తూ… రెండున్నర అడుగుల నుంచి అడుగు ఎత్తున్న పొట్టి ఆవుల్ని అభివృద్ధి చేశారు. దాదాపు 3000 ఆవుల్ని దఫదఫాలుగా బ్రీడింగ్ చేస్తూ ఈ మైక్రో, నానో పొట్టి ఆవుల్నీ, ఎద్దుల్నీ సృష్టించారట.
ఎక్కడైనా పెరుగుతాయి…
మట్టినేలతోపాటు ఇవి ఇంట్లో గచ్చు మీదా హాయిగా తిరిగేస్తాయట. వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్లందరికీ సులువుగా మచ్చికవుతుంటాయట. ఇప్పటి వరకూ
దాదాపు 500కిపైగా మినియేచర్ ఆవుల్ని ఈ గోశాలలో అభివృద్ధి చేశారు. ఈ పొట్టి ఆవుల ధర జత దాదాపు రూ.లక్ష నుంచి పది లక్షల వరకూ ఉంటుందట. బుజ్జి మేకల్లాంటి ఈ ఆవుల్ని పల్లెల్లోనే కాదు, పట్టణాల్లోనూ పెంచుకోవడానికి ఎక్కువగానే కొంటున్నారట. నట్టింట్లో చెంగు చెంగున పరుగులు తీస్తున్న ఈ ఆవుల్ని చూసి అందరూ తెగ ముచ్చటపడిపోతున్నారంటే… ఆశ్చర్యమేముంది!… ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఉంటే వైరల్ గా కూడా మారాయి..