ఉక్రెయిన్‌పై రష్యా దాడులు..మాస్కో.. కీవ్‌పై 300కి పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో దాడి…!

కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు కొనసాగుతున్నప్పటికీ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా మాస్కో.. కీవ్‌పై 300కి పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. దాడిలో అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. భవనాల శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకున్నారని.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. భారీ ఆస్తి నష్టం సంభవించిందని.. ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని తెలిపారు. యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ.. ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.