టీనేజర్లకు క్యాన్సర్ ముప్పు…

గత కొన్నేళ్లుగా 20, 30, 40 ఏళ్ల వయసున్న వారిలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, దీర్ఘకాలిక ఒత్తిడి, పొగాకు వినియోగం వంటివి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. క్యాన్సర్ కేసుల్లో జన్యుపరమైన కారణాల వాటా 5 నుంచి 10 శాతం లోపే ఉంటోంది…భవిష్యత్తులో టీనేజ్ పిల్లలను సైతం క్యాన్సర్ వేధించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని చిన్న చిన్న అలవాట్లు క్యాన్సర్ రిస్క్‌ను చాలా వరకు తగ్గిస్తాయని సజెస్ట్ చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..హెల్తీ డైట్
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అన్ని రకాల పోషకాలు, మైక్రో న్యూట్రియెంట్స్ ఉండే ఫుడ్స్ డైట్‌లో ఉండాలి. విటమిన్ సి లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అవకాడో, నట్స్, సీడ్స్, తృణ ధాన్యాలు వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆహారాలు రెగ్యులర్‌గా తినాలి. ముఖ్యంగా, పోషకాలు ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మంచివి. ఇవి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేసి శరీరంలో వాటి వృద్ధిని నివారిస్తాయి..వ్యాయామం
ప్రస్తుత జనరేషన్ టీనేజర్లకు.. వారి రోజువారీ జీవితంలో వ్యాయామం (Exercise) అనేది ముఖ్య భాగం కావాలి. ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు తప్పనిసరిగా ఎక్సర్‌సైజ్ చేయాలి. కనీసం వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి యాక్టివిటీస్ అయినా అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ కొలెస్ట్రాల్ లెవెల్స్‌, ఇన్సులిన్‌ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉండి ఓవరాల్ వెల్‌నెస్‌ మెరుగు పడుతుంది..ఒత్తిడికి చెక్
నియంత్రణ లేని ఒత్తిడి ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రమాదకరం. ఇది హార్మోన్లను అన్ బ్యాలెన్స్ చేసి బరువు పెరిగేలా చేస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచి మెదడు, గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఒత్తిడిని మేనేజ్ చేసుకోవాలి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో ఒత్తిడి దరిచేరదు…ఎండలో ఆరోగ్యం
మార్నింగ్ సన్ లైట్ నుంచి విటమిన్ D సమృద్ధిగా పొందవచ్చు. రోజూ పొద్దున్నే కాసేపు ఎండలో ఉంటే మూడ్ ఇంప్రూవ్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సర్కాడియన్ రిథమ్‌ని సైతం రెగ్యులరైజ్ చేస్తుంది. రాత్రిపూట మంచి నిద్రను కలిగిస్తుంది…తగినంత నిద్ర
టీనేజర్లతో పాటు అందరూ కంటి నిండా నిద్రపోవాలి. దీంతో రాత్రి సమయంలో మెదడు, శరీర కణాలు తగినంత విశ్రాంతిని పొంది నయం అవుతాయి. పైగా, తగినంత నిద్ర హార్మోన్లను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సహిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి, కాగ్నిటివ్ ఎబిలిటీ ఇంప్రూవ్ కావడానికి సపోర్ట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది..స్వచ్ఛమైన గాలి
వాయు కాలుష్యం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్న క్రమంలో.. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కీలకంగా మారింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి…ఎక్కువ మరణాలు వీటివల్లే
క్యాన్సర్ కేసుల్లో దాదాపు 95 శాతం జీవనశైలి కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. క్యాన్సర్ మరణాల్లో 30 నుంచి 35 శాతం ఫుడ్‌తో ముడిపడి ఉన్నాయట. ఇక, పొగాకు వాడకం వల్ల 30 శాతం, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లు, ఫంగస్, వైరల్ లోడ్ కారణంగా 15 నుంచి 20 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. స్మోకింగ్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం, షుగరీ డ్రింక్స్ తాగడం, దీర్ఘకాలిక ఒత్తిడి, పెస్టిసైడ్స్‌తో పెరిగిన కూరగాయలను ఎక్కువగా తినడం వంటివి క్యాన్సర్‌కి దారితీస్తున్నాయి.