రష్యాలో భారీ భూకంపం…తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక..

రష్యాలో భారీ భూకంపం

రికార్డ్ స్కేల్ పై తీవ్రత 8.8గా నమోదు

తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక..

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఈరోజు 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం (Russia Earthquake) సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు…

రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడింది. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయి. రష్యా అధికారుల ప్రకారం, ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది.

సునామీ హెచ్చరికలు

ఈ భూకంపం తర్వాత, జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు జపాన్ మీడియా తెలిపింది. జపాన్ ప్రభుత్వం పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల నష్టం సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత భవనాలకు వెళ్లాలని తెలిపింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లవద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు.

హవాయి రాజధాని..

ఈ నేపథ్యంలో అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలకు తక్షణ స్థలం ఖాళీ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.

రష్యాలో పరిస్థితి..

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు…

భయంతో జపాన్ తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు ఖాళీ చేస్తున్నారు. జపాన్ లోని ఇషినొమకీ పట్ణణంలో ప్రజలు సామాన్లు సర్దుకుని కొండ ప్రాంతాలకు బయల్దేరారు. హియోరియామా కొండపైకి వేల సంఖ్యలో జనం చేరుకోవడం.. 2004 నాటి సునామీ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

మొదటి సునామీ అలలు జపాన్ లోనే..

రష్యాలో వచ్చిన భయంకరమైన భూకంపానికి సునామీ అలలు మొట్టమొదటగా జపాన్ దేశాన్ని తాకాయి. జపాన్ ఉత్తర తీరంలోని హొక్కయిడో ప్రాంతాన్ని సునామీ అలలు ఢీకొన్నట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీ NHK ప్రకటించింది. మొట్టమొదటి అలలు 30 సెంటీ మీటర్లతో దూసుకొచ్చినట్లు పేర్కొంది. సునామీ అలల ధాటికి తీరంలోని కొన్ని కట్టడాలు నేల కూలినట్లు పేర్కొంది….

జపాన్, అమెరికాతో పాటు, న్యూజిలాండ్, ఇండోనేషియాలో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. కొన్ని చోట్ల కూడా సునామీ ప్రభావం కనిపించడం ప్రారంభమైంది…