అమెరికా జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్య..!

అమెరికా జైలులో తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సదరు యువకుడు జైలులో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు…మృతుడిని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్‌(31)గా గుర్తించారు. జులై 26న ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..

జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కుర్రెముల ఉప్పలయ్య, శోభ దంపతుల కుమారుడు కుర్రెముల సాయికుమార్ (31) పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్‌ నగరంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఒక్లహోమాలో సాయికుమార్‌ 15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ, ముగ్గురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్లకు అంగీకరించని మరో 19 మంది బాలికల అసభ్య చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు…
దీంతో బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో FBI 2023 అక్టోబర్‌లో నిందితుడు సాయి కుమార్‌ను అరెస్ట్ చేసింది…

19 మంది బాలికల అసభ్యచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి బెదిరించినట్లుగా విచారణలో వెల్లడైంది.

ఈ ఆరోపణలు రుజువు కావడంతో బాలికలపై వేధింపులు, చైల్డ్‌ పోర్నోగ్రఫీని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించిన అమెరికా కోర్టు ఈ ఏడాది మార్చి 27వ తేదీన సాయికుమార్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మనోవేదనకు గురైన సాయికుమార్‌ జూలై 26వ తేదీన జైలులోనే ఉరివేసుకున్నాడు. కాగా, అతని కుటుంబసభ్యులు అమెరికాకు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం..