డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరో బాంబు…50 శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వు జారీ..!

డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరో బాంబు పేల్చారు. భారత్పై మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు 25 శాతం ప్రకటించగా మొత్తం కలిపి 50 శాతం సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది..భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించినట్లు అధ్యక్షుడు ట్రంప్ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో తెలిపారు. దీని ప్రకారం యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలోకి దిగుమతి చేసుకున్న భారతదేశ వస్తువులు 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నామని వెల్లడించారు..

రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోళ్లు జరుపుతున్నందునే ఈ టారిఫ్ విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో ట్రంప్‌ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల్లో భాగంగా ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా.. కొత్తగా విధించిన 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి వర్తింపజేస్తున్నట్లు ట్రంప్‌ తన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ సుంకాలకు ప్రతీకారంగా భారత్‌ ఏదైనా సుంకాలు వడ్డించాలని ప్రయత్నిస్తే ఈ టారిఫ్‌లను అధ్యక్షుడు సవరించొచ్చని వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

చైనా తర్వాత మనపైనే..

వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే ఎత్తుగడలో భాగంగా ట్రంప్‌ ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు. తాజాగా రష్యా చమురును కొనుగోళ్లను నిలిపివేయలేదన్న కారణంతో భారత్‌పై ఏకంగా 50 శాతం టారిఫ్‌ మోపారు. దీంతో చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్న దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై 51 శాతం సుంకం అమెరికా విధిస్తోంది. మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30, వియత్నాంపై 20 శాతం, ఇండోనేసియాపై 19 శాతం చొప్పున ట్రంప్‌ టారిఫ్‌ విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్‌పై 15 శాతం టారిఫ్‌ ప్రకటించారు…

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959