హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బులెట్లు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించి తెలిపారు. చందానగర్ ఖజానా దోపిడీ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశామని, ప్రధాన నిందితులు దీపక్, ఆశిష్‌ను పుణెలో పట్టుకున్నామని తెలిపారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బీహార్ వాసులుగా గుర్తించామని అన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, 20 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి పలు నగల దుకాణాలను పరిశీలించారని వివరించారు.
బీహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇది : ఆగస్టు 12న చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో చోరీ జరిగిందని వినీత్ గుర్తు చేశారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కీ నిర్వహించారని, ఖజానా జ్యువెలరీలో దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చారని, బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపైనే పరారయ్యారని తెలిపారు. ఫేక్ నంబర్ ప్లేట్లతో వచ్చి చోరీకి పాల్పడి తర్వాత నంబర్ ప్లేట్లు మార్చుకున్నారని, భద్రతా సిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకుని దోపిడీకి పాల్పడ్డారని గుర్తు చేశారు. పారిపోవడానికి సులభంగా ఉందని నగర శివారులోని దుకాణాన్ని ఎంచుకున్నారని, 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు ఎత్తుకొని పరారీ అయ్యారని చెప్పారు…బంగారంగా భావించి బంగారం పూత పూసిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారని, ఈ బిహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇదని, గతంలో కోల్‌కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని, రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని, కూలీలకు ఏమైనా నేర చరిత్ర ఉందా అని యజమానులు ఆరా తీయాలని వినీత్ సూచించారు. లేబర్ సప్లయ్ ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలను మాకు ఇస్తే బాగుంటుందని, హైదరాబాద్ నగరానికి వచ్చే అందరి సమాచారం పోలీసులకు అందటం చాలా కష్టమని పేర్కొన్నారు.
“ఆగస్టు 12న చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో చోరీ జరిగింది. ఖజానా జ్యువెలరీలో దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చారు. బైకులపై వచ్చి దోపిడీ చేసి మళ్లీ బైకులపైనే పరారయ్యారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు ఎత్తుకొని పరారీ అయ్యారు. బంగారంగా భావించి బంగారం పూత పూసిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ బీహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇది. గతంలో కోల్‌కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించాం. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. 20 రోజుల క్రితం నగరానికి వచ్చి పలు నగల దుకాణాలను పరిశీలించారు. చందానగర్ ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు చేశాం” – వినీత్, మాదాపూర్ డీసీపీ
ఆరోజు అసలేం జరిగింది : చందానగర్‌లో ఈ నెల 12 న ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్దారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆరుగురు దుండగులు 2 రౌండ్ల ఫైరింగ్ జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయాలు అయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్కీ అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించారు..