రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు. “మరి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకువెళ్తారో ముందుగా సమాధానం చెప్పాలి. హైదరాబాద్కు కావాల్సింది కాళేశ్వరం జలాలే” అని అన్నారు. కాళేశ్వరం కూలడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి మైండ్ దొబ్బింది అంటూ హరీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Harish Rao
కాళేశ్వరంపై చర్చకు నేను రెడీ.. కానీ సీఎం వస్తారా? లేక పీసీసీ చీఫ్గా వస్తారా? ముందుగా నిర్ణయించుకోవాలి అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ రంగనాయక సాగర్లో నడిచే పంపులు కూడా కాళేశ్వరంలో భాగమే కాదా? దీనికి సమాధానం చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. వరద నీటిని ఒడిసి పట్టకుండా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి సీఎం బురద రాజకీయాలు చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు…
సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. “రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుంభకర్ణుడిలా నిద్రిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు.రైతులకు కావలసిన యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “51 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్క యూరియా బస్తా కూడా తెచ్చే దమ్ములేదు. రైతులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని హరీష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో రైతుల పాదాలను గోదావరి జలాలతో కడిగారని గుర్తుచేస్తూ.. “ఇప్పుడు రైతులను పోలీసుల కాళ్లు మొక్కించే పరిస్థితి తెచ్చింది రేవంత్ ప్రభుత్వం” అని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు..
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఉన్నా రైతుల కోసం ఏమాత్రం కృషి చేయలేదని, రైతుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని హరీష్ ఆరోపించారు. “ఏ ఎన్నికలు పెట్టినా రైతులే కాంగ్రెస్ కు గుణపాఠం చెపుతారు” అని ఆయన హెచ్చరించారు. తక్షణమే రైతులకు యూరియా అందించకపోతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తుందని హరీష్ స్పష్టం చేశారు.