రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ప్రపంచానికి సహాయపడగల స్థితిలో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్లో మాట్లాడిన మోదీ భారత్ త్వరలో ప్రపంచపు 3వ అతిపెద్ద ఆర్థికశక్తిగా మారి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుందని చెప్పారు. సంస్కరణలు తమ ప్రభుత్వానికి నిబద్ధత, నమ్మకంతో కూడిన విషయమన్న ఆయన దీపావళికి ముందు జీఎస్టీ సంస్కరణలు పూర్తి చేసి ధరలను తగ్గిస్తామన్నారు.
‘పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులకు పెంచాలి. ప్రైవేటు రంగాలు శుద్ధ ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, క్వాంటం టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి. త్వరలో ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం సహకారం అందిస్తుంది. ఆర్థిక లోటు 4.4శాతానికి తగ్గనుంది. బ్యాంకులు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. 2014 తర్వాత ఆటోమొబైల్ ఎగుమతులు 50వేల కోట్ల నుంచి1.2 లక్షలకోట్లకు పెరిగాయి. ఇప్పటికే సాధించిన దానితో సంతృప్తి చెందడం నా స్వభావం కాదు. అదే విధానం మన సంస్కరణలకు మార్గనిర్దేశం చేస్తుంది. మనకు సంస్కరణలు ఒత్తిడి, సంక్షోభం వల్ల కలిగేవి కావు. అవి కేవలం నిబద్ధత, నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఆర్థి వ్యవస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నప్పుడు దాని పునాది బలంగా ఉంటుంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి సంపూర్ణ శక్తితో ముందుకు సాగుతోంది. అభివృద్ధికి పునాది ఆత్మనిర్భర భారత్.’ అని ఆయన స్పష్టం చేశారు..