రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కాదని, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) విమర్శించారు. 11-12 ఏడ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ర్టాన్ని సతాయిస్తూ, తీవ్ర నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేక అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రపూరితంగా చేతులు కలిపాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఆ రెండు పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ‘రేవంత్రెడ్డీ.. నీకు దమ్మూ ధైర్యముంటే, నల్లమల పులిబిడ్డవే అయితే ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడు’ అని సవాల్ విసిరారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మరిచిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పంచుతారని, వారిచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని మోసంతోనే జయించాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ జనగర్జన’ భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు…ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారతాయని కేటీఆర్ హెచ్చరించారు. రూ. 70 వేల కోట్లతో ఆల్మట్టి డ్యాం ఎత్తును మరో ఐదు మీటర్లు పెంచే కర్ణాటక కాంగ్రెస్ కుట్ర ఫలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చుక నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 519 మీటర్లు ఉన్న ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచి కృష్ణా నుంచి తెలంగాణకు చుక్కనీరు రాకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో పాలమూరు ఎడారిగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముప్పు ముంచుకొస్తుంటే పులినని చెప్పుకొనే సీఎం రేవంత్ పిల్లిమాదిరిగా ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.70 వేల కోట్లు కేటాయించినా మన సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిప్పు లు చెరిగారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదోనని ఇటీవల ఆదిలాబాద్లో కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి చెప్పిన మాటలు విని నవ్వుకునే పరిస్థితి ఉన్నదని అన్నారు. జూపల్లికి కాంగ్రెస్ సర్కారు వస్తదో, రాదోననే అనుమానం ఉండవచ్చని, కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం కాంగ్రెస్ రాదని, మళ్లా వచ్చేది కేసీఆర్ అనే విషయం స్పష్టంగా తెలుసని చెప్పారు. మంత్రులకు సోయి, తెలివిలేకపోవచ్చుగానీ అచ్చంపేట గడ్డ బిడ్డలకు తెగువ, తెలివి, పౌరుషం ఉన్నది కాబట్టే దుర్మార్గపు కాంగ్రెస్ను మళ్లీ రానీయబోమని ఘంటాపథంగా చెప్తున్నారని అన్నారు.
అచ్చంపేట పరువు తీస్తున్న రేవంత్
అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పుట్టిన రేవంత్రెడ్డి సీఎం అయి రాష్ట్రం పరువుతీస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయనలో అపరిచితుడు ఉన్నారని, ఎప్పుడు ఏం మాట్లాడతడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ‘పొద్దున రాములా, రాత్రయితే రెమోలా వ్యవహరిస్తరు.. ఓ రోజేమో పేద రైతు కుటుంబం నుం చి వచ్చి సీఎం అయితే కేసీఆర్, కేటీఆర్ ఓరుస్తలేరంటరు. ఇంకోరోజేమో నాకు వ్యవసాయమే తెలియదు, మా తాత, తండ్రి పోలీస్ పటేల్ అంటడు. అసెంబ్లీలో అపరిచితుడులా మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్ఠను గంగలో కలుపుతున్నరు’ అని విమర్శించారు. ‘గుడ్లు పీకి గోటీలాడుతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అనే భాషచూస్తే అసహ్యం వేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటరా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు. హామీలను వదిలి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సరార్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గు ణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన పుట్టిన గడ్డ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుపెట్టాలనే సంకల్పంతోనే ఇక్కడ జన గర్జన సభ పెట్టామని స్పష్టం చేశారు. మీ ఉత్సాహం, ఊపు చూస్తుంటే స్థానిక ఎన్నికల్లో ఓట్లడిగేందుకు వచ్చే కాంగ్రెస్సోళ్లకు తగిన బుద్ధి చెప్తారనే విశ్వాసం కలుగుతున్నదని అన్నారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు..