*ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్రపట్టదు: మోదీ.*
ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించి, నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని, దాని పేరు వింటేనే శత్రువులకు నిద్ర పట్టదని అన్నారు. ఛత్రపతి శివాజీ ప్రేరణతో నావికాదళం ముందుకు సాగుతోందని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు..
*‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత*
చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు..
ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తాం..డీజీపీ
కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్కు డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను పూర్తిస్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని తెలిపారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తామని స్పష్టం చేశారు..భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు. GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. అలాగే అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
రియాజ్ ఎన్కౌంటర్పైనా డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్.. ఏఆర్ పోలీసుల గన్ను లాక్కున్నాడని తెలిపారు. ఆ గన్తో పోలీసులపై కాల్పులు జరపబోయాడని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు..
రేపు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. (Weather Updates)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరితో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది..అలాగే, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది..
మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా..?” చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ ప్రశ్నలు.
రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ దుయ్యబట్టారు. ఈ 18 నెలల కాలంలో ఎవరికైనా సంతృప్తి ఉందా…? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు..
వైఎస్ జగన్ ప్రశ్నలు…
“చంద్రబాబు గారు….. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా… మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా..?” అని వైఎస్ జగన్ నిలదీశారు. ట్వీట్ లో నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఉద్యోగుల హామీల అంశాలను ప్రస్తావించారు.
“నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000, 50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4 వేలు, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట” ఏమైందని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
“ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ఏటా రూ.15,000, ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు” ఏమైయ్యాయని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? అని ప్రశ్నించారు..