మావోయిస్టులు లొంగిపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి
కావున మావోయిస్టులు అజ్ఞాతం వీడి లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలి – సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు…విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని సీఎం వ్యాఖ్యానించారు. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’న ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’గా ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు..గ్రేహౌండ్స్ కమాండోలు.. టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవన్ కళ్యాణ్‌లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారని అన్నారు. మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు…