దూసుకొస్తున్న కొత్త అల్పపీడనం.. మరోసారి తుపాను ముప్పు..!

తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస తుపానులు అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ నెల నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. రెండుమూడు రోజుల క్రితం మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 17 రంగాలకు రూ.5,244 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.98లక్షల మంది రైతులకు సంబంధించి 3.75లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు పెద్దెత్తున కోతకు గురయ్యాయి. మరోవైపు.. మొంథా తుపాను తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభావం చూపింది. వరంగల్, ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో నష్టం వాటిల్లింది. అయితే, ప్రస్తుతం మొంథా తుపాను ముప్పు తప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఏపీ వైపు మరో తుపాను దూసుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది….నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్ సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో ఈ కొత్త అల్పపీడనం బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ అల్పపీడనం తీవ్రత పెరిగితే మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..