సౌత్తాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ రికార్డు…

సౌత్తాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు..అంతేకాకుండా భారత గడ్డపై అత్యధిక సిక్స్‌లు బాదిన పర్యాటక బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతను 51 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు.

భారత్‌తో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్ ఈ ఫీట్ సాధించాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మార్కో జాన్సెన్.. ముత్తుసామితో కలిసి 9వ వికెట్‌కు 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. 91 బంతులాడి 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు బాది పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో 9వ స్థానంతో పాటు అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక సిక్స్‌లు బాదిన ఏకైక బ్యాటర్‌గా మార్కో జాన్సెన్‌ నిలిచాడు. ఈ జాబితాలో మార్కో జాన్సెన్(7 సిక్స్‌లు) తర్వాత ఆండీ బ్లిగ్నూ(6), మైఖెల్ హోల్డింగ్(6), వసీమ్ అక్రమ్(5), మిచెల్ జాన్సన్(5), మార్క్ వుడ్(5), మోయిన్ అలీ(5), నొమన్ అలీ(5)లు ఉన్నారు.

టెస్ట్‌ల్లో భారత గడ్డపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన వివ్ రిచర్డ్స్ రికార్డ్‌ను మార్కో జాన్సెన్ అధిగమించాడు. 51 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్ తాజాగా బద్దలయ్యింది. 197లో వివ్ రిచర్డ్స్ ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత 2001లో మాథ్యూ హెడెన్ చెన్నైలో 6 సిక్స్‌లు బాది ఈ రికార్డ్ సమం చేశాడు. తాజా గౌహతి మ్యాచ్‌లో జాన్సెన్ 7 సిక్స్‌లు బాది ఈ రికార్డ్‌ను అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో సౌతాఫికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది..