రాష్ట్ర రవాణా రంగంపై కారుమబ్బులు..వాహన ఫిట్నెస్ ఛార్జీలపై లారీ యజమానుల కన్నెర్ర – 9 నుంచి గూడ్స్ రవాణా బంద్!..
రాష్ట్ర రవాణా రంగంపై కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. నిత్యావసరాల నుంచి నిర్మాణ సామాగ్రి వరకు సరుకులను చేరవేసే లారీల చక్రాలు ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం లారీ యజమానుల నెత్తిపై పిడుగులా పడింది. పాత వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను భారీగా పెంచడంపై రవాణా రంగం భగ్గుమంటోంది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది..
గూడ్స్ షెడ్లు, షిప్ యార్డులు బంద్: ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డుల నుంచి నడిచే సుమారు 10 వేలకు పైగా గూడ్స్ రవాణా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నారు. లారీలు రోడ్డెక్కకపోతే ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా స్తంభించిపోయి వ్యాపార వర్గాలకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు..
లబోదిబోమంటున్న యజమానులు: కేంద్రం పెంచిన ఫీజుల పెంపుదల చూసి లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. 13 నుంచి 20 ఏళ్ల వయసున్న వాహనాలపై ఫీజులను గణనీయంగా పెంచారు. ఇక 20 ఏళ్లు దాటిన వాహనాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇప్పటివరకు రూ. 1,300 మాత్రమే ఫిట్నెస్ ఫీజుగా చెల్లిస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఏకంగా రూ. 33,000 చెల్లించాల్సి వస్తోంది. డీజిల్ ధరలు, టోల్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమపై, ఈ కొత్త ఫీజులు పెనుభారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం: కేంద్రం తెచ్చిన ఈ నిబంధనలను రాష్ట్రంలో అమలు చేయకుండా ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అసోసియేషన్ వాదిస్తోంది. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్నెస్ చార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి, ఫీజులు తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో 9వ తేదీ నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు..