డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలి.. కేటీఆర్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజని, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేసినట్లుగానే కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్‌ దివస్‌’ పేరుతో పండుగలా జరుపుకోవాలన్నారు. డిసెంబర్ 9న 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఒక రూపం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు..