సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్రపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం..!

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో, అంతర్గత విభేదాలు, రెబల్స్ సమస్యలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కీలక సమీక్ష నిర్వహించారు…ఈ సమీక్షలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డితో పార్టీ ఇంచార్జ్ మీనాక్షి జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురవుతున్న పరిస్థితులు, స్థానిక నేతల తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పాత్రపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు,, సమావేశంలో పార్టీ అంతర్గత నివేదికలను పరిశీలించిన సీఎం, 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో రెబల్స్‌ను నియంత్రించడంలో, పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంలో ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని స్పష్టం చేశారు. ముఖ్యంగా రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, లోకల్ గ్రూప్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని హెచ్చరించారు. ఇది సాధారణ ఎన్నిక కాదు. పార్టీ భవిష్యత్తుకు పునాది వేసే ఎన్నిక అని స్పష్టం చేసినట్లు సమాచారం