మైనర్లు వాహనాలు నడపటం నేరం…

సూర్యాపేట జిల్లా… హుజూర్ నగర్

మైనార్టీ తీరని బాల బాలికలు బైకులు, కార్లు తదితర వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని ఆదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టంలో పొందుపరిచిన అంశాలలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాల పట్ల కనీస, ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని ఆమె విద్యార్థులకు సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవటం, అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపడం కూడా చట్ట ప్రకారం నేరమన్నారు. అట్టి నేరాలకు పాల్పడిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధించడం జరుగుతుందని న్యాయమూర్తి తెలిపారు. రోడ్డు ప్రమాద మరణాల వల్ల కుటుంబాలు అగాధం లోకి నెట్టబడుతున్నాయనీ అటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ సమాజాన్ని జాగృతం చేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరుల చేత రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, నాగేష్ రాథోడ్, సైదా హుస్సేన్, ఉదారి యాదగిరి, అడవి రాముడు, శంకర్ నాయక్, కళాశాల కరస్పాండెంట్ పశ్య శ్రీనివాస్ రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల, హెడ్ కానిస్టేబుల్ రాములు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959