టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ పై విజయం…!

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది..అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తీ స్టన్నింగ్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), రింకూ సింగ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ(2/27), కైల్ జెమీసన్(2/54) రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. గ్లేన్ ఫిలిప్స్(40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/37), శివమ్ దూబే(2/28) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరగనుంది.

ఖాతా తెరవకుండానే..

239 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే డెవాన్ కాన్వే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఖాతా తెరవకుండా న్యూజిలాండ్‌ వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్‌లో రచిన్ రవీంద్ర(1)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఒక్క పరుగుకే న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో గ్లేన్ ఫిలిప్స్, టీమ్ రాబిన్సన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 50 పరుగులే చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ సూర్య.. వరుణ్ చక్రవర్తీని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. దూకుడుగా ఆడిన రాబిన్సన్(21)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది..