కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కొత్త బడ్జెట్ పౌరుల జీవనశైలిని మారుస్తూ రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి నూతన దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచి, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం స్థిరమైన దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు.
ఏఐ సహా లేటెస్ట్ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ రిఫార్మ్స్, రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ విధానాలకు ఈ బడ్జెట్ ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు..
ఆదివారం కుప్పం పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో CM చంద్రబాబు నాయుడు ఈ విషయాలు వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించిన ఈ బడ్జెట్ భారతీయుల ఆశలు, అవసరాలకు అనుగుణంగా ఉందని, దీర్ఘకాల దృష్టితో రూపొందించబడిందని సీఎం పేర్కొన్నారు. ఈ బడ్జెట్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయన్నారు.
బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. వ్యవసాయం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలకు బలమైన ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతుందని, సంపద సృష్టి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు.
కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు:
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పలు విధానాలకు ఈ కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు రావడం ఎంతో శుభపరిణామమన్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై మార్గాల ద్వారా అమరావతి, తిరుపతి నగరాలు మరింత అభివృద్ధి చెందుతాయని వివరించారు. హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో తిరుపతికి మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.
టూరిజంలో ఏపీ నెంబర్ 1:
డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఉండటం వల్ల బీచ్ శాండ్, ఖనిజాలు, రక్షణ రంగానికి అవసరమైన వనరులు అందించే అవకాశం పెరుగుతుందని అన్నారు. అలాగే సెమీకండక్టర్ పరిశ్రమల కోసం భారీగా నిధులు కేటాయించడం రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు. టెక్స్టైల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని చెప్పారు. ముఖ్యంగా టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం అన్నారు.
డేటా సెంటర్ హబ్‌గా భారత్:
అరకు ప్రాంతం, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. కాజూ, కొబ్బరి, గంధపు చెక్క వంటి రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం రైతులకు ఉపయోగకరమని చెప్పారు. డేటా సెంటర్లకు దీర్ఘకాల పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల భారత్ డేటా హబ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. తీరప్రాంత అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగంలో వృద్ధి ద్వారా రాష్ట్రానికి మరింత లాభం చేకూరుతుందన్నారు.
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు:
అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుగా రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ యూనివర్సిటీ స్వయంప్రతిపత్తితో పనిచేస్తుందని, ఎఐ లివింగ్ ల్యాబ్స్‌ను కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. స్పేస్, డ్రోన్, కెమికల్ పార్కులతో పాటు వేగవంతమైన పాలనకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.