నైజీరియాలో ఘోరం..162 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు..

నేజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను చుట్టుముట్టారు ఏ మాత్రం కనికరం లేకుండా జరిపిన ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 162 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గ్రామాల్లోని వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం నైజీరియా దేశం తీవ్రమైన భద్రతా, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ISWAP) వంటి సంస్థలు నిరంతరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా వేల సంఖ్యలో ప్రజలు ఈ హింసకు బలికాగా, లక్షలాది మంది తమ నివాసాలను వదిలి శరణార్థులుగా మారుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పౌరులపై దాడులను అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.

ఈ తాజా దాడితో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వోరో, నూకు గ్రామాల్లోని నివాసితులు ప్రాణ భయంతో అడవుల్లోకి పరుగులు తీశారు. ఉగ్రవాదులు కేవలం కాల్పులకే పరిమితం కాకుండా, ఇళ్లను తగులబెట్టడం, నిత్యావసరాలను దోచుకోవడం వంటి చర్యలకు పాల్పడినట్లు సమాచారం. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై క్వారా రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ బలగాలు ఉగ్రవాద నిర్మూలన కోసం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల భయపడిపోయిన మూకలు, ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి…

ప్రతీకార దాడి..

గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపుతున్నా, ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్లో సుమారు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారిని చంపినందుకు ప్రతీకారంగానే సాయుధ ముఠాలు ఈ నరమేధానికి పాల్పడి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అలాగే కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు రెచ్చిపోయారు. అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు…