ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య
ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి
వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు.. ఆటో డ్రైవరుగా పని చేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురైన రవి
రవి త్వరలో చనిపోతాడని జూలై నెలలో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించిన భార్య ప్రశాంతి
9 నెలలైనా చనిపోవట్లేదని ఈనెల 2న రవికి మద్యం తాగించి.. రవి బావమరిది శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య
ప్రశాంతి తీరుపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా, బయటపడిన నిజాలు..
రెన్యువల్ దగ్గర్లో ఉండటం తో ముందే ప్లాన్…?.
గత ఏడాది జూలైలో రవికి బావమరిది వరుస అయిన దేశబోయిన శ్రీనివా్‌సతో కలిసి తమకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వారా రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. నెలలు గడుస్తున్నా రవి చనిపోకపోవడంతో బీమా డబ్బుల కోసం ప్రశాంతి పథకం వేసింది. దేశబోయిన శ్రీనివాస్, అతడి స్నేహితులు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబులను సంప్రందించి కుట్ర పన్నింది. రవిని చంపితే వచ్చే డబ్బుల్లో సగం ఇస్తానని వారితో ఒప్పందం చేసుకుంది. పథకం ప్రకారం శ్రీనివాస్.. ఈనెల 2న రవిని ఆటోలో ఎక్కించుకువెళ్లి.. ఫుల్లుగా మద్యం తాగించాడు. ఖమ్మం రూరల్ మండలం వీవీ పాలెం శివారులో అతడిని వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జోగి వెంకటేశ్‌కు చెందిన కారును జోగి రాజ్‌కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ఘటన సమయంలో ఆ రోడ్డులో ఎవరైనా వస్తున్నారా? అని గమనించేందుకు జోగి రాంబాబును కాపలా పెట్టారు. ఘటన తర్వాత తర్వాత రాజ్‌కుమార్ ఆ కారును ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు గ్రామంలోని వెంకటేశ్‌కు మిత్రుడైన సురేశ్ ఇంటివద్ద ఉంచాడు. కారు ప్రమాదానికి గురైందని, తర్వాత వచ్చి తీసుకెళతాని చెప్పి వెళ్లిపోయాడు. వీవీ పాలెం శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించి.. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. రవి భార్య ప్రశాంతే హత్యకు కుట్ర పన్నిందని తేల్చారు. హతుడి భార్య ప్రశాంతిని, మిగతా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.