బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు.. మాజీ మంత్రి హరీష్ రావు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి వచ్చాక రద్దు చేశాడు
మీ సిద్దిపేట వెటర్నరీ కాలేజీను కొండగల్ ఎత్తుకపోయినా, మీ అభివృద్ధి పనులను ఆపేసిన అని చెప్పేందుకు సిద్దిపేటకు వస్తున్నావా రేవంత్ రెడ్డి?
రద్దు చేసిన రూ.1,070 కోట్ల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాను –మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
మాదేమో శ్రమ ఫలితం.. మీదేమో శిలా ఫలకమా.., ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మాది.. ప్రారంభోత్సవానికి కత్తెర మీదా అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికంటే ముందు జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1070 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొ్ట్టారని.. వాటన్నింటినీ రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఇన్నాళ్లు మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం లేదన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు.. ఇప్పటికీ నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం పేరిట ఇక్కడ అడుగుపెడుతున్నారని.. ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున నిన్ను కొన్ని ప్రశ్నలు అడగదలచుకునన్నానని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ ఫామాయిల్ ఫ్యాక్టరీ. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మాట్లాడిన నీ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభించడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. కోనసీమ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కనిపించే ఫామాయిల్ మొక్కలను ఏ నదీ ప్రవాహం లేని సిద్దిపేట జిల్లాలో ఎలా సాగు చేశారో ఇప్పటికైనా మీకు అర్థమైందా..? అని ప్రశ్నించారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మొక్కలు పెరుగుతాయి. మంచి దిగుబడి ఇస్తాయి. కరువు పీడిత సిద్దిపేట జిల్లాలో తేమ శాతం ఎక్కడి నుండి వచ్చిందో నీ వెంట ఉండే ఇంజనీర్లను అడుగు ముఖ్యమంత్రి గారు అని ఎద్దేవా చేశారు.
2018 లో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ(IIOPR) Indian Institute of Oilpalm Research శాస్త్రవేత్తల బృందం సిద్దిపేట జిల్లాలో తిరిగి నీటి వసతి, గాలిలో తేమ లేదని సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కాదన్నారు. కానీ 2021 లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైన అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా నీటి వసతి, గాలిలో తేమశాతం పెరగడం వలన సిద్దిపేట జిల్లా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని IIOPR శాస్త్రవేత్తల బృందం ప్రకటించిందని గుర్తుచేశారు. ఫామాయిల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.300 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. నర్మెట్ట గ్రామ రైతుల సహకారంతో టీజీఐఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించామని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 4 వ తేదీన ఫ్యాక్టరీకి భూమిపూజ చేసి వెంటనే సివిల్ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. పామ్ ఆయిల్ నూనె గింజల దిగుబడి వచ్చేలోగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రావాలని మొదటి దశ పనులను శరవేగంగా ప్రారంభించామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (zld) వ్యవస్థతో మలేషియా టెక్నాలజీ తో ఈ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని నిర్మించాలని ఆనాడే నిర్ణయం తీసుకోవడం జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. ముందుగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రారంభించాక ఆ వెంటనే రిఫైనరీ ఆయిల్ ఉత్పత్తి జరిగేలా ప్లాంటును కూడా ప్రారంభించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి నీటి కొరత లేకుండా రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి ఎల్ డి 9 కాలువ ద్వారా 20 కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసేలా స్టోరేజీ వాటర్ రిజర్వాయర్ కూడా సిద్ధం చేయడానికి 2023 జూలై నెలలో ఫౌండేషన్ వేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విడుదలైన నిధులతో ఆనాడే ప్రారంభమైన పనుల కారణంగా ఇప్పుడు పూర్తయిన ఫ్యాక్టరీని మీరు ప్రారంభిస్తున్నారనే విషయాన్ని గమనించాలని సూచించారు…