వైభవ్ బ్యాటింగ్‌కు షాకయ్యా..

పిడుగు వైభవ్ సూర్యవంశీపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అతను ఆడుతున్న ఫియర్‌లెస్ గేమ్ చూసి పిచ్చోడినయ్యానని తెలిపాడు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ ఓటమికి చెత్త బౌలింగే కారణమని అంగీకరించాడు. పవర్ ప్లేలో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయాలేకపోయామని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పిన హార్దిక్.. భవిష్యత్తులో అతను ఇంతకంటే మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించాడు.

బ్యాటింగ్‌ కాదు.. బౌలింగే..

‘మా బౌలింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. బ్యాటింగ్ ఏ మాత్రం కాదు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ ఓటమికి మా బౌలర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ యూనిట్‌గా మేం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ రాజస్థాన్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆడింది. ఈ ఓటమికి బ్యాటింగ్‌ ఏ మాత్రం కారణం కాదు. ఈ ఓటమికి ఖచ్చితంగా మా బౌలింగ్ విభాగమే బాధ్యత వహించాలి.

టీ20 క్రికెట్‌లో రెండు బంతులతో ఫలితం మారిపోతుంది. 27 పరుగుల తేడాతో ఓడిపోయామంటే.. ఐదు బంతులు మంచిగా వేయాల్సింది. అలా వేసి ఉంటే ఐదు సిక్సర్లు వచ్చేవి కావు. మేం సరైన బంతులు వేసి ఉంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేవాళ్లం. కానీ రాజస్థాన్ ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ తర్వాత మేం ఎంత ప్రయత్నించినా విజయం దక్కలేదు.

వైభవ్ బ్యాటింగ్‌కు షాకయ్యా..

15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ నిర్భయంగా ఆడటం చూసి షాకయ్యాను. ఈ మ్యాచ్‌కు సిద్దమయ్యేటప్పుడు అతని గురించి మేం మాట్లాడుకున్నాం. అతను బ్యాటింగ్ చేసినా విధానం.. ఫియర్‌లెస్ గేమ్, షాట్ సెలెక్షన్ అద్భుతం.. అమోఘం. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం. రేపు ఉదయం సూర్యుడు ఉదయించినట్లే మేం కూడా పుంజుకుంటాం. మా తప్పులను సరిదిద్దుకొని ఆర్‌సీబీతో తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం.’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు..