అమెరికా చేసిన పనికి ఈ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తమ వాణిజ్య నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా ఆ దేశ యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్టు టెహ్రాన్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ముక్కలైపోయింది.
చైనా నుంచి ఇరాన్కు వెళుతున్న తూస్కా అనే వాణిజ్య నౌకను అమెరికాకు చెందిన యూఎస్ఎస్ స్ర్రూయెన్స్ యుద్ధ నౌక అడ్డుకుంది. అమెరికా విధించిన నౌకాదళ నిర్బంధాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలతో హెచ్చరికల అనంతరం నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు…అమెరికా చర్యను సాయుధ సముద్రపు దొంగతనంగా ఇరాన్ సైనిక కమాండ్ ఐఆర్జీసీ అభివర్ణించింది. నౌకను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే తమ బలగాలు డ్రోన్లతో ప్రతిదాడికి దిగినట్టు తెలిపింది. తమ ఐఆర్జీసీ బలగాల జోక్యంతో అమెరికా సేనలు వెనక్కి తగ్గాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. అయితే, ఇరాన్ నౌక ఇంకా తమ ఆధీనంలోనే ఉందని అమెరికా ప్రకటించింది..