మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధార్ జిల్లాలో బుధవారం రాత్రి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అనంతరం ఎదురుగా వస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ధార్ జిల్లాలోని బగ్గడ్ నుంచి కూలీలతో వారి స్వస్థలానికి వెళ్తున్న వాహనం చిక్లియా క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడి… ఎదురుగా వస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది..
ఈ ప్రమాదంలో మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు..
ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది..
పోలీసుల వివరాల ప్రకారం, పనులు ముగించుకుని సుమారు 40 మందికి పైగా కూలీలు ఒకే వాహనంలో తమ గ్రామాల వైపు ప్రయాణం ప్రారంభించారు.
వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులతో పాటు వేగంగా వెళ్తుండగా, చిక్లియా ఫాటా సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.