నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ .
ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి
రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దుస్తులు పైకిత్తి ఓ వ్యక్తి కీచకపర్వం
సీవీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు.. కేసు నమోదు చేసి, నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తింపు..
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్న తరుణంలో, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వేధింపుల ఉదంతాన్ని పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఆల్కాపూర్ టౌన్షిప్లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు శ్రమించి పట్టుకున్నారు..పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన ఆల్కాపూర్ టౌన్షిప్లో నివసించే ఓ మహిళ తన చిన్నారిని ప్లే స్కూల్ నుంచి తీసుకుని కాలినడకన ఇంటికి వస్తోంది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న సదరు మహిళను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆమె సమీపంలోకి వచ్చి అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏమాత్రం అధైర్యపడకుండా, నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
మహిళా భద్రతకు సంబంధించిన కేసు కావడంతో నార్సింగి పోలీసులు ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. కేసు నమోదు చేసిన వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన ఆల్కాపూర్ టౌన్షిప్ పరిసర ప్రాంతాల్లోని పలు సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ విజువల్స్, సాంకేతిక ఆధారాల (Technical Evidence) విశ్లేషణ సహాయంతో నిందితుడిని వడ్డే నాగరాజుగా గుర్తించారు. ఆ వెంటనే నిందితుడు ఉన్న ప్రాంతంపై దాడి చేసి అతనిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు..