చైనాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 82 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో తొమ్మిది మంది గల్లంతు అయ్యారు. పేలుడు తర్వాత గని పాక్షికంగా కుప్పకూలింది. దీంతో మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు..చైనాలోని షాన్ఝీ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి కిన్యువాన్ కౌంటీలోని లియూషెన్యు బొగ్గు గనిలో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని చైనా అధికారిక వార్తా గ్ఝిన్ హువా తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు గని లోపల విధుల్లో ఉన్నారని పేర్కొంది. కార్బన్ మొనాక్సైడ్ భారీ పరిమాణంలో విడుదల కావడమే ఈ పేలుడుకు ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు….
చాంగ్జీ నగరంలోని కిన్యువాన్ కౌంటీలో ఉన్న లియుషెన్యు బొగ్గు గనిలో శుక్రవారం గ్యాస్ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చైనా బొగ్గు గనుల పరిశ్రమలో ప్రాణాంతక ప్రమాదాలు సర్వసాధారణం కావడంతో, ఇటీవలి సంవత్సరాలలో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేసినప్పటికీ, ప్రమాదాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
2025 ఆరంభంలో, వాయువ్య చైనాలోని షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు. అంకాంగ్ నగరంలోని జెన్పింగ్ కౌంటీలో భూగర్భ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎనిమిది మంది కార్మికులు ఆ ప్రదేశంలో మరమ్మతు పనులు చేస్తుండగా, వారిలో ఐదుగురు సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలిపారు.