ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య దూరమైందంటూ భర్త కేసు…బీహార్ ఘటన వైరల్..!

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య దూరమైందంటూ భర్త ఆరోపణలు.. బీహార్ ఘటన వైరల్..

బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అమన్ కుమార్ తన భార్య గుంజన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

ప్రభుత్వ ఉద్యోగం రాగానే భార్య తనను, తమ 10 ఏళ్ల కొడుకును వదిలేసి వెళ్లిపోయిందని బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆరోపించారు. ఆమె చదువు కోసం తాను వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మానని, కానీ ఆమె ఇప్పుడు వేరుగా ఉంటూ మరో ఉపాధ్యాయుడితో సంబంధం పెట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమన్ కుమార్, గుంజన్ కుమారిలకు 2013లో వివాహం జరిగింది. వీరికి ఆరుష్ ఆర్య అనే 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయానికి గుంజన్ కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివింది, కానీ ఆమెకు ఉపాధ్యాయురాలు కావాలని ఆశ ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అమన్ కూలీగా పనిచేస్తూ ఆమె చదువుకు అండగా నిలిచాడు. ఆమె చదువుల కోసం 2022లో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా అమ్మినట్లు అమన్ తెలిపాడు. భర్త ప్రోత్సాహంతో గుంజన్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి బీపీఎస్సీ (BPSC) టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె TRE-02 రిక్రూట్‌మెంట్ ద్వారా 6 నుండి 8వ తరగతి ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బిదుపూర్ బ్లాక్‌లోని ఓ పాఠశాలలో పోస్టింగ్ పొందింది.

అమన్ తెలిపిన కథనం ప్రకారం.. 2013లో గుంజన్‌తో వివాహం జరిగిన తర్వాత ఆమె చదువుకుని మంచి స్థాయికి చేరాలని తాను రాత్రింబవళ్లు కష్టపడ్డానని తెలిపాడు. కూలీ పనులు చేస్తూ, కుటుంబ బాధ్యతలు మోయడంతో పాటు, ఆమె భవిష్యత్తు కోసం పూర్వీకుల భూమిని కూడా అమ్మేశానని వాపోయాడు.

తాజాగా గుంజన్‌కు BPSC టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె తనను దూరం పెట్టిందని, మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అమన్ ఆరోపిస్తున్నాడు. మే 25న గుంజన్‌ను ఆమె ప్రియుడితో కలిసి పట్టుకున్నానని, దీంతో పెద్ద ఎత్తున గొడవ జరిగి పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారని తెలిపాడు.

ఈ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. గుంజన్ కూడా అమన్‌పై మోసం కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వారి కుమారుడు “నాకు నాన్న దగ్గరే ఉండాలి.. అమ్మతో వెళ్లను” అని చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.