ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్వాదీ పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టో..1
ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్వాదీ పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టోను నవంబర్ 26న విడుదల చేయనుంది. యువత, విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి..మహిళలు, బాలికల సంక్షేమంపై ప్రత్యేకంగా మరో మేనిఫెస్టోను కొన్ని వారాల తర్వాత విడుదల చేయనుంది. జనవరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకు ప్రత్యేక పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ భావిస్తోంది.
తొలి మేనిఫెస్టోలో దళితుల సమస్యలు, శాంతిభద్రతలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అంశాలనూ ప్రాధాన్యంగా చేర్చనున్నారు. నవంబర్ 21న జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మూడు రకాల మేనిఫెస్టోలు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు మహిళల కోసం ప్రత్యేక పత్రం, జిల్లాల వారీగా మరో పత్రాన్ని తీసుకొస్తామని చెప్పారు.
వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలిపి పీడీఏ రాజకీయ ప్రాతిపదికగా పార్టీ సామాజిక న్యాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ప్రజల జీవితాల్లో విద్య, ఉపాధి, ఆదాయం, భద్రత, అవకాశాలకు సంబంధించిన అవసరాలను మేనిఫెస్టో ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2022 ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు గత ఐదేళ్లలో చోటుచేసుకున్న మార్పులు, కొత్త సవాళ్లను జోడిస్తూ పలుమాసాల పాటు సంప్రదింపులు, పరిశోధనలతో ఈ పత్రాన్ని సిద్ధం చేశారు…