సంగారెడ్డి జిల్లాలో దారుణం.. మహిళ గొంతు కోసి హత్య
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం.
దాడిలో భర్తపై కత్తితో దాడి చేయగా, మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
మృతురాలి బంగారు ఆభరణాలు యథాతథంగా ఉండటం, లైంగిక దాడి ఆనవాళ్లు కనిపించకపోవడంతో హత్య వెనుక అసలు కారణం ఏమిటన్నది మిస్టరీగా మారింది.
తీవ్రంగా గాయపడిన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.