కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్…!

కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్..మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణిలో స్కాం జరగకపోతే, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోయిఉంటే.. సింగరేణి పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించండి

సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉపఎన్నికలు తీసుకురండి అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు ఓట్ల ద్వారా మీకు బుద్ధి చెబుతారు.

అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. సింగరేణి ఆస్తుల అంశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో గత నెల 30 నుంచి జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు బుధవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం అవినీతి, కుంభకోణాలమయమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేయకతప్పదని అన్నారు. సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని సవాలు విసిరారు.

బీఆర్ఎస్‌కు అరెస్టులు, కేసులు కొత్త కాదని బాల్క సుమన్ తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తనపై 226 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని చెప్పారు..