దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు, వర్షాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత చల్లటి కబురు అందించింది..గత కొన్ని వారాలుగా కదలికల్లేక స్తంభించిపోయిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మళ్లీ పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడబోయే రెండు బలమైన అల్పపీడనాలు (Back-to-Back Low Pressure Areas), రుతుపవన ద్రోణి గమనంలో వస్తున్న కీలక మార్పుల వల్ల రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వానలు దంచికొట్టబోతున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. జూన్ నెలలో ఏర్పడిన వర్షపాత లోటును ఈ అల్పపీడనాలు పూర్తిగా భర్తీ చేయనున్నాయి..
ముంబైకి 500 మిల్లీమీటర్ల ముప్పు.. లోతట్టు ప్రాంతాలు అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడే వరుస అల్పపీడనాలు దేశ మధ్య భాగం గుండా ప్రయాణించనుండటంతో దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాలలో వర్షాల సాంద్రత విపరీతంగా పెరగనుంది. దేశ పశ్చిమ తీరంలో ఉన్న ముంబై మహానగరాన్ని మరోసారి అతి భారీ వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వారాంతం నాటికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో దాదాపు 500 మిల్లీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇంత భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించే ప్రమాదం ఉందని, నగరవాసులు అనవసరంగా బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..