ఇది తమ దళ సాధించిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక విజయం..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

ఉక్రెయిన్ అంతర్గత రక్షణ వలయాలను ఛేదిస్తూ రష్యా సైన్యం యుద్ధంలో మరో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత వ్యూహాత్మక నగరమైన కొస్తాంటినివ్కాను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది..యుద్ధానికి ముందు దాదాపు 78,000 జనాభా ఉన్న ఈ నగరం కోసం 2025 చివరి నుండి రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ నగరం పతనం కావడం అనేది గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఎదురుదెబ్బగా అంతర్జాతీయ మిలిటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ, ఇది తమ దళ సాధించిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక విజయం అని ప్రశంసించారు.

కొస్తాంటినివ్కా ఎందుకు అంత ముఖ్యం?

రష్యాకు డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనే సుదీర్ఘ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి కొస్తాంటినివ్కా నగరం ఒక ముఖద్వారం లాంటిది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి ప్రధాన నగరాలైన క్రామాటర్స్క్, స్లోవియాన్స్క్ లకు వెళ్లే ప్రధాన రవాణా మార్గంలోనే ఈ కొస్తాంటినివ్కా ఉంది. ఉక్రెయిన్ నిర్మించుకున్న బలమైన రక్షణ గోడను రష్యా బద్దలు కొట్టడంతో, ఇప్పుడు డొనెట్స్క్ ప్రాంతంలో మరింత లోపలికి చొచ్చుకెళ్లడానికి రష్యాకు దారులు సుగమమయ్యాయి. ప్రస్తుతం నగరంలోని శిథిలాలు, బేస్మెంట్ల చాటున దాక్కున్న ఉక్రెయిన్ సైనికులను ఏరివేసే ఆపరేషన్ సాగుతోందని రష్యా కమాండర్ అంటోన్ గ్రునిస్ స్పష్టం చేశారు.