బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం..!

R9TELUGUNEWS.COM.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణించే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..తుపాన్ ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.