భారత్కు పొరుగు దేశం భూటాన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇథనాల్ మిక్స్ చేసి తయారైన E20 పెట్రోల్ను సరఫరా చేయాలని భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రతిపాదనను భూటాన్ స్పష్టంగా తిరస్కరించింది..ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నిర్ణయం పర్యావరణంపై వ్యతిరేకత వల్ల కాదు.. తమ దేశంలోని ఇంధన నిల్వ వ్యవస్థలు E20కి అనుకూలంగా లేకపోవడమే కారణం అంటూ తప్పించుకుంది.
E20 పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్కు గాలిలోని తేమను వేగంగా పీల్చుకునే స్వభావం ఉంటుంది. దీంతో నిల్వ ట్యాంకుల్లోకి నీరు చేరితే ఇంధనం విడిపోవడం, నాణ్యత తగ్గిపోవడం, వాహనాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. భూటాన్లోని చాలా ఇంధన డిపోలు కొండ ప్రాంతాల్లో ఉండటంతో తేమ, నీటి లీకేజీని పూర్తిగా అరికట్టడం కష్టమని అక్కడి అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం E20 పెట్రోల్ సేఫ్ కాదని భూటాన్ ముందుగానే గుర్తించింది.
పాత వాహనాలకు అదనపు భారం..
భూటాన్లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం E20కు పూర్తిగా అనుకూలం కాని పాత వాహనాల్లో విడిభాగాల మార్పు, ప్రత్యేక ఇంధన యాడిటివ్ల కోసం ప్రతి సంవత్సరం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో కొత్త ఇంధనం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం కూడా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వంతో పాటు నిపుణులు గ్రహించారు.