యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం..!

వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటా కు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మరో మూడురోజులు అదనపు గడువు ఇచ్చింది. అయితే.. ఈ ఫీచర్ పై ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా ముగిసేంతవరకూ భారత్ లోకి అందుబాటులోకి తీసుకురాబోమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు..ప్రస్తుతం వాట్సాప్ లో ఒకరితో ఒకరు చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. అయితే వాట్సప్.. ఈ ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసేలా కొత్త ఫీచర్ ను డిజైన్ చేసింది. దీనివల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు, ఒకరిపేరుతో మరొకరు చలామణి అయ్యే ముప్పు విపరీతంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.