2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన సంచలన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో 38 మంది ఉగ్రవాదులకు విధించిన మరణశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును హైకోర్టు ధర్మాసనం ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను జస్టిస్ ఎ.వై. కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన డివిజన్ బెంచ్ పూర్తిగా కొట్టివేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిదీన్’కు చెందిన ఈ నిందితులందరికీ చట్టప్రకారం సరైన శిక్షే పడిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.. మామూలు దారుణం కాదు. మాటలకందని విషాదం. కనీ విని ఎరుగని రక్తపాతం. అయిన వాళ్ళని కోల్పోయి.. ఆర్త నాదాలు పెడుతూ..అహ్మదాబాద్ నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 56 మంది చనిపోయారు.. ఉగ్రవాదులు బాంబులు పేల్చివేసి అహ్మదాబాద్ నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దారుణం భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లాగా.. నెత్తుటి జ్ఞాపకంలాగా మిగిలిపోయింది.
ఈ వ్యవహారం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక బృందాలు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేశాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పట్టుకున్నాయి. మొత్తం 49 మందిని దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత న్యాయస్థానాలలో ఆధారాలను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. అనేక దఫాలుగా విచారణ పూర్తయిన తర్వాత.. ఆ 49 మంది విషయంలో గుజరాత్ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సంచలన తీర్పును వెల్లడించింది..