మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర సన్నిధిలో పర్యాటక అభివృద్ధికి రూ.13 కోట్లు..

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర సన్నిధిలో పర్యాటక అభివృద్ధికి రూ.13 కోట్లు..

హుజూర్‌నగర్ నియోజకవర్గానికి మరో కీలక వరం…
.
మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్..

పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

చరిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సన్నిధిలో పర్యాటక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేవాలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల కల్పనతో పాటు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి కోసం రూ.13 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధుల మంజూరులో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

మట్టపల్లి క్షేత్రాన్ని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలుమార్లు చర్చించి, ప్రతిపాదనకు ఆమోదం లభించేలా కృషి చేసినట్లు తెలిసింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

ఈ నిధులతో మట్టపల్లి ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. దీనివల్ల రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హుజూర్‌నగర్ ప్రాంతంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మట్టపల్లి క్షేత్ర అభివృద్ధికి పరిపాలనా అనుమతి లభించడం పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయంతో మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.