డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ధృవీకరించబడిన ఎబోలా మరణాలు 1,000 దాటాయి. దీంతో, వ్యాప్తిని వేగంగా అదుపులోకి తీసుకురాకపోతే ఈ మహమ్మారి చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా మారవచ్చని ఆఫ్రికా అగ్ర ప్రజారోగ్య అధికారి హెచ్చరించారు.
కేవలం రెండు వారాల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపు అయింది. గురువారం నాటికి 2,536 కేసులు, 1,033 మరణాలు నమోదైనట్లు జాతీయ ప్రజారోగ్య సంస్థ నివేదించింది . ఇటూరిలోని దాని అసలు కేంద్రం నుండి ఈ మహమ్మారి మరో రెండు కొత్త ప్రావిన్సులకు వ్యాపించడంతో, జూలై 4న 506గా ఉన్న మరణాల సంఖ్య పెరిగింది.
కాంగోలో ఎబోలా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్…
ఘనాలో బుధవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ‘ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కాసెయా మాట్లాడుతూ, ఇప్పటివరకు 1,031 మరణాలు నమోదైనట్లు అధికారికంగా ధృవీకరించారు. “అక్కడ ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. మన వద్ద తగినన్ని వ్యాక్సిన్లు, మందులు, నిధులు లేకపోవడం వల్లే వారు మరణిస్తున్నారు” అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, సోమవారం నాటికి 2,473 కేసులు నమోదయ్యాయి. వీరిలో కనీసం 737 మంది రోగులు ఐసోలేషన్లో లేదా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా నమోదైన గణాంకాల కంటే ఎబోలా వ్యాప్తి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మే 15 నుంచి ప్రారంభమైన ఈ మహమ్మారి వ్యాప్తి వేగాన్ని అందుకోవడంలో ఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారని తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా నమోదువుతున్న కేసులలో 80% కేసులు ముందస్తుగా గుర్తించిన ఇన్ఫెక్షన్ చైన్ (బాధితుల సంబంధిత కాంటాక్ట్స్) బయటి నుంచే వస్తున్నాయి. అంటే, ఆరోగ్య అధికారులు ట్రాక్ చేయగలిగే వేగం కంటే కూడా ఈ వైరస్ చాలా వేగంగా సమాజంలోకి వ్యాపిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది.