రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి..జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్..

సూర్యాపేట జిల్లా…

హుజూర్‌నగర్ టౌన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లిఫ్టుల నిర్వహణ, భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. లిఫ్టుల సంరక్షణ, భద్రతా చర్యలు, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అధికారులు పలు సూచనలు చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండి లిఫ్టుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

*జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ మాట్లాడుతూ*..

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా స్పష్టమైన నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు.

అలాగే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని చెప్పారు. ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకునేలా రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంకా విత్తనాలు వేయని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన పప్పుధాన్యాలు, నువ్వులు, ఆముదం (క్యాస్టర్) వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ పామ్, కూరగాయలు, మిర్చి వంటి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల సూచనలు పాటిస్తూ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు….