అప్పు తీర్చేందుకు కంకర రాళ్లకు బంగారం పూత.. రూ.1.62 లక్షల టోకరా..

అప్పు తీర్చేందుకు కంకర రాళ్లకు బంగారం పూత.. రూ.1.62 లక్షల టోకరా

నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చే పేరుతో కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ పలుమార్లు ఒత్తిడి చేయడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని, వాటిలో బంగారం రాళ్లు ఉన్నాయని శ్రీనివాస్ నమ్మబలికాడు.

ఆ బంగారం రాళ్లను అప్పు కింద తీసుకోవాలని సూచించిన శ్రీనివాస్, నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని రమేష్‌కు చెప్పాడు. అంతేకాకుండా, అక్కడికి వచ్చే సమయంలో అదనంగా రూ.32 వేలు తీసుకురావాలని కోరాడు.

శ్రీనివాస్ చెప్పినట్లే ఘన్‌పూర్‌కు వెళ్లిన రమేష్‌కు నాలుగు కుండల్లో బంగారం రంగు పూసిన నాలుగు రాళ్లను అందజేశాడు. అయితే వాటిపై అనుమానం వచ్చిన రమేష్ పరిశీలించగా, అవి అసలు బంగారం కాదని, సాధారణ కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు గుర్తించాడు.

దీంతో తాను రూ.1.62 లక్షల మేర మోసపోయానని గ్రహించిన రమేష్ వెంటనే డిచ్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.