ప్రియుడితో వెళ్లిన వివాహిత.. చిత్తూరు జిల్లాలో కుటుంబ వివాదం.. కట్టేసి దేహ శుద్ధి చేసిన స్థానికులు..!
ప్రియుడితో వెళ్లిన వివాహిత.. చిత్తూరు జిల్లాలో కుటుంబ వివాదం..
చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబ వివాదం పోలీసులకు తలనొప్పిగా మారింది. భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ఓ యువకుడితో కలిసి వెళ్లిన వివాహిత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం, గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ (27)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్ (22)తో రాంగ్ కాల్ ద్వారా శోభకు పరిచయం ఏర్పడింది. అనంతరం ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని, భర్త తనను అనుమానించి వేధించేవాడని శోభ పోలీసులకు తెలిపింది. తొలుత భర్తను హత్య చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ, తర్వాత ఆ నిర్ణయం మార్చుకుని నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి కుప్పంలోని ఓ ఆలయంలో బాలాజీ నాయక్ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, భార్య కనిపించడం లేదని చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో శోభ, బాలాజీ నాయక్ బెగ్గిలిపల్లిలో కలిసి ఉంటున్నట్లు గుర్తించిన చిరంజీవి బంధువులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు, శోభ తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, ఆమె ఒత్తిడితోనే వివాహం చేసుకున్నానని బాలాజీ నాయక్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, తన భర్త వేధింపులు తట్టుకోలేక స్వచ్ఛందంగానే ఇంటి నుంచి వెళ్లి బాలాజీ నాయక్ను వివాహం చేసుకున్నానని శోభ తెలిపింది.
ఇద్దరి వాదనలు భిన్నంగా ఉండటంతో కేసును ఎలా పరిష్కరించాలనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చట్టపరమైన అంశాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.