సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 498ఏ కేసులకు మార్గం…!

సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 498ఏ కేసులకు మార్గం.

న్యూఢిల్లీ: లివ్-ఇన్ రిలేషన్షిప్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహ స్వభావాన్ని పోలిన సహజీవన సంబంధాల్లో కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం (Cruelty) కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. మహిళలకు సెక్షన్ 498ఏ కింద కల్పించిన రక్షణ కేవలం చట్టబద్ధమైన వివాహాలకే పరిమితం కాదని, వివాహాన్ని పోలిన కొన్ని సహజీవన సంబంధాలకూ వర్తిస్తుందని పేర్కొంది.
అయితే ప్రతి లివ్-ఇన్ రిలేషన్షిప్‌కు ఈ నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంబంధం వివాహ స్వభావాన్ని పోలి ఉందని, ఇరువురికీ వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు మహిళ తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. కేవలం సహజీవనంలో ఉన్నారనే కారణంతో మాత్రమే సెక్షన్ 498ఏ వర్తించదని ధర్మాసనం పేర్కొంది.
కర్ణాటకకు చెందిన డాక్టర్ లోకేశ్ బి.హెచ్. తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ఈ తీర్పు వెలువడింది. 2025 నవంబరులో కర్ణాటక హైకోర్టు క్రిమినల్ కేసును కొట్టివేయాలన్న వారి అభ్యర్థనను తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.