మిల్లుపై తక్షణ చర్యలు తీసుకోవాలి: మండల ఎంఆర్పీఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి..

మిల్లుపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఎంఆర్పీఎస్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో ఉన్న సునంద రైస్ ఇండస్ట్రీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, అధిక శబ్దం, ధూళి, దుర్వాసన, పురుగుల కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గరిడేపల్లి మండల ఎంఆర్పీఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి ఆరోపించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత రైస్ మిల్లుపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై గతంలోనే వంద మంది గ్రామస్థుల అభిప్రాయాలు, సంతకాలతో కలిసి 08-06-2026న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులకు విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు. అలాగే జిల్లా సివిల్ సప్లై శాఖ కూడా 18-06-2026న సంబంధిత వివరాలను కాలుష్య నియంత్రణ మండలికి పంపించినప్పటికీ, ఇప్పటివరకు సూర్యాపేట కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని, చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రభుత్వ అధికారులు ఇదే విధంగా ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ఎలాంటి నష్టం జరిగినా అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గరిడేపల్లి మండల ఎంపీడీవోను ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి, రైస్ మిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ కుర్రి వెంకన్న, గ్రామ అధ్యక్షుడు పిట్ట వెంకటేష్, నకిరేకంటి రవి, ఆలంపల్లి శేఖర్, కొత్తపల్లి పవన్, బచ్చలకూరి నాగార్జున, పిట్ట నాగరాజు, మచ్చ ఆదాం తదితరులు పాల్గొన్నారు.