కొండా సురేఖపై వేటు వేయాలని మెజారిటీ ఎమ్మెల్యేల పట్టు..

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానం ప్రతినిధుల వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఇవాళ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఆమె అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ వ్యవహారంపై పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అసంతృప్తిపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి.. కొండా సురేఖపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.