బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు..వేద పండితుల సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించిన కేసీఆర్.. అనంతరం శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, జహంగీర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన పూజలతో ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది..