మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు,, భూసేకరణ ప్రక్రియలో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు.
గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. మూసీ పునరుజ్జీవనం.. హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకమైన ప్రాజెక్టు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్డీసీఎల్ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితకు సంబంధించిన వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు. పార్టీ అంతర్గత అంశాలపై నేను బహిరంగ మాట్లాడలేనని, అయితే సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ వివరణలకు సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ పరిశీలిస్తుందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నాయకులైనా, కార్యకర్తలైనా ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేఅని ఆయన తేల్చిచెప్పారు.
నరేంద్ర మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అనే భావనతో వ్యవహరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర అని అన్నారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమన్నారు. దీనిని రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం అంటే రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విదేశాల్లో ఉన్నప్పుడే ఈ అంశంపై స్పందిస్తే తనను దేశద్రోహి అంటారని భావించి తెలంగాణ కు వచ్చిన తరువాతే స్పందిస్తున్నానన్నారు. వికసిత్ భారత్ పేరుతో కేంద్రం పనిచేస్తుండగా, తెలంగాణ రైజింగ్ విజన్ పేరుతో మేము పనిచేస్తున్నామన్నారు. మా ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారని, రాజ్యసభలో ప్రధాన విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తుతారన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే తన పర్యటనను కేంద్రం అడ్డుకుందని, ఇది రాజకీయ వివక్ష… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన విమర్శించారు. మేమంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, ఇది సమాఖ్య సూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన విదేశీ పర్యటనను అడ్డుకోవచ్చు.. తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని, విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.