ముఖ్యమంత్రుల ఏజెంట్లు..మంత్రుల ఏజెంట్లు కాలనీల మీద పడి తిరుగుతున్నరు : హరీశ్ రావు

కుత్బుల్లాపూర్‌లో 22ఏ బాధితుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. పద్మారావు నగర్‌ ఫేజ్‌ 1 కాలనీకి చెందిన విజయ్‌ అనే వ్యక్తి చెబుతున్నడు. 58 సంవత్సరాల కింద లే అవుట్ అయిందన్నా.. నేను సెకండ్‌ పర్చేజర్‌ను (కొనుగోలుదారు). గిప్పుడు తీసుకొనిపోయి దాన్ని 22ఏలో పెట్టుడు.. ఇదేం పిచ్చితనం.. ఇదేం తుగ్లక్ చర్య అని చెప్తున్నడని అన్నారు.

చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్‌ ఫీల్డ్‌ కాలనీ.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు రూ.30 వేలు, ఫ్లాటుకు రూ.30 వేలు ఆ పైసలు తీసుకుపోతనే గవర్నమెంట్‌లో పని అయితది.. ఏజెంట్లు తిరుగుతున్నరన్నా అని చెప్తున్నడు. అంటే 22ఏలో పెట్టుడు ముఖ్యమంత్రి, పొంగులేటి ఏజెంట్లు ఇవాళ కాలనీల మీద, గ్రామాల మీద పడి తిరుగుతున్నరు. మీరు డబ్బులు ఇయ్యండి.. 22ఏలో నుంచి తీసేస్తమంటురన్నాడని హరీశ్ రావు తెలిపారు.

నిన్న ఒకాయన తెలంగాణ భవన్‌కు వచ్చిండు.. అమీన్‌పూర్ అనుకుంటా..మా భూమి ఎందుకు 22ఏలో పెట్టిర్రు అని ఎమ్మార్వో దగ్గరకు పోయిండట. మాకు తెల్వదు.. ఆర్డీవోను పోయి అడుగుపో అన్నడట. ఆర్డీవో దగ్గరకు పోతే పోయి కలెక్టర్‌ను అడుగుపో అన్నడట. ఇది నేను కాదు.. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. గవర్నమెంట్‌ను అడుగుపో అన్నడట. బయటకు వచ్చినంక ఓ బ్రోకర్ కలిసిండట. చూడు బై వట్టిగా తీసేస్తరా..? బర్రె పాలు ఉత్తగనే ఇస్తదా.. సొప్ప వేస్తేనే పాలు ఇస్తది. గదేందో చూసుకోపో అంటుండట. ఈ 22ఏ వెనుకున్న కథేందంటే కమీషన్లు దొబ్బుడని హరీశ్‌ రావు ఫైర్ అయ్యారు.